అందరి సహకారంతో జల్‌జీవన్‌

 దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇవ్వాలన్న జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యాన్ని 2024నాటికల్లా పూర్తి చేస్తామని.. ఇందుకు అన్నిరాష్ర్టాలు, అధికారులు పూర్తి సహకారం అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. ఆర్నెల్లుగా పథకం రూపకల్పనలో తలమునకలయ్యామని.. ఇకనుంచి పథకం పనులను వేగవంతంచేస్తామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ర్టాల ప్రాం తీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రికి తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ జల వనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా షెకావత్‌ మాట్లాడుతూ.. పథకం నిధుల కోసం నాబా ర్డు, ఇతర ఆర్థికసంస్థలను సంప్రదిస్తున్నామని తెలిపారు. బడ్జెట్‌కు లోబడి రాష్ర్టాలకు 50 శాతం నిధులను ఇస్తామని చెప్పారు. జల్‌జీవన్‌ మిషన్‌ను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అన్నిరాష్ర్టాలు ప్రధానంగా భూఉపరితల జలాల్ని అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అందుబాటులో లేనిచోట మాత్రమే భూగర్భజలాలను పంపిణీ చేయాలని సూచించారు. పథకం అమలుకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ర్టాలకు సహకారం అందిస్తుందన్నారు.


తెలంగాణ చేపట్టిన మిషన్‌ భగీరథకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి.. కేంద్రమంత్రిని కోరారు. జల్‌జీవన్‌ మిషన్‌ అమలుకు కేంద్రం ఐదేండ్లలో రూ.రెండు లక్షల కోట్లు వెచ్చించేందుకు ప్రణాళిక రూపొందించిందని.. దేశంలోని 32.5 కోట్ల కుటుంబాలకు పరిగణనలోనికి తీసుకుంటే ఒక్కో కుటుంబానికి రూ.6,200 చొప్పున అవుతుందని సీఎస్‌ తెలిపారు. ఈ ప్రాతిపదికన తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ర్టాలు రుణాలు తీసుకొనే పరిమితిని కూడా పెంచాలని కోరా రు. కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం 2019-20కి తెలంగాణకు రూ.211.04 కోట్లు కేటాయించిందని, ఇందులో మొదటి విడుత రూ.105.52 కోట్లు విడుదల చేసిందని సీఎస్‌ తన నివేదికలో పేర్కొన్నారు. గోదావరి- కృష్ణా- కావేరీ నదుల అనుసంధా న ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ కోరారు. కేంద్రం సాయం చేయాలని కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షదీవుల ప్రతినిధులు కోరారు. సదస్సులో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పరమేశ్వరన్‌ అయ్యర్‌, అదనపు కార్యదర్శులు రాజేశ్వరి, అరుణ్‌ బరోకా, తెలంగాణ ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరిరాం, కృపాకర్‌రెడ్డి, కాడా కమిషనర్‌ జీ మల్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.